రాజ్యాంగంలోని ఆర్టికల్ 20,21 ప్రతి వ్యక్తికీ తన ఆహార అలవాట్లతో పాటు
అన్ని హక్కులకూ హామీ ఇచ్చింది. ప్రతి వ్యక్తికీ తనదైన ఆహరపుటలవాట్లు కలిగి
ఉండి, నచ్చినది తినే హక్కు ఉన్నది. దీన్ని ఎవరు ఏ
రూపంలో నియంత్రించినా వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమేగాక, రాజ్యాంగ ఉల్లంఘనగా
చెప్పక తప్పదు. కానీ మన పాలకులు ఏదో ఒక సాకుతో పశు వధను నియంత్రించేందుకు
ప్రయత్నిస్తున్నారు.
ఈ నెల పదిహేడవ తేదీన మాంసాహార అమ్మకం మీద ఉన్న నిషేధంపై బొం బాయి హైకోర్టు
స్టే విధించడంతో ఈ వివాదానికి తాత్కాలిక తెర పడ్డది. అయితే ఆ రోజున
కబేళాలు పనిచేయకూడదని, అమ్మకం సాగించ వచ్చునని న్యాయస్థానం స్పష్టం
చేసింది. జైన పర్వదినమైన పర్యూషణ్ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం మాంస
విక్రయాన్ని నిషేధించడంపై కొద్ది రోజులుగా వివాదం సాగుతున్నది. బీజేపీ మొదట
వారం రోజుల నిషేధం విధించాలని భావించింది. కానీ మిత్రపక్షమైన శివసేన నుంచే
వ్యతిరేకత వచ్చింది. దాంతో నాలుగు రోజులకు కుదించింది. అయినప్పటికీ వివాదం
చల్లారలేదు. మాంస విక్రయందారుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు
అమ్మకానికి అనుకూలంగా స్పందించింది. ఈ కేసులో వాదోపవాదాలు సాగుతున్నప్పుడు
హైకోర్టు చేసిన
వ్యాఖ్యలు గమనార్హమైనవి. ముంబయి ప్రగతిశీలమైనదనే భావన ఉన్నది.
కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తిరోగమనమైనవి అని కోర్టు
వ్యాఖ్యానించింది. మేం (జైనుల) మనోభావాలను అర్థం చేసుకుంటు న్నాం. కానీ
కొనుగోలు అనేది ఇష్టాన్ని బట్టి ఉంటుంది అని కోర్టు హితవు చెప్పింది.
ఇంతకాలం మీరు పశువధపై నిషేధం విధించారు, కానీ మాంస విక్రయంపై కాదు అని
న్యాయ స్థానం గుర్తు చేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన ధోరణిని
మార్చుకోవాలని, ముంబయి ఆధునిక నగరమనీ, వరుసగా ఎనిమిది రోజుల నిషేధం తగదని
కూడా సూచించింది. మాంసాహారం, శాకాహా రం అనేది ఆయా వ్యక్తుల ఇష్టాన్ని బట్టి
ఉంటుంది. ఇక్కడ ఏది మంచిదనే చర్చ కాదు.
పౌరుల స్వేచ్ఛ, హక్కులకు సంబంధించిన అంశమిది.మాంసాహారంపై ఈ మధ్య వివాదం
చెలరేగడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేది స్పష్టం. నిజానికి మహారాష్ట్రలో ఈ
నిషేధం మొదలైంది 1994లో కాంగ్రెస్ హయాంలోనే. పదేండ్ల తరువాత రెండు రోజుల
నిషేధాన్ని నాలుగు రోజులకు పొడిగించారు. అయితే ఈ నిషేధం కాగితాలకే పరిమితం
అయింది తప్ప ఆచరణలో లేదు. ఇక దేశ వ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే
సంఘపరివార్ ప్రబోధాలు, బీజే పీ ప్రభుత్వ విధానాలు ఈ వివాదాన్ని మరింత
ముదరగొడుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ఏదో రూపం లో పాలనా పగ్గాలు చేపట్టిన
తర్వాత తమ మెజారిటీ వాద విధానాలను ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మొత్తం సమాజాన్ని హైందవీకరణ చేసే పని ని చాపకింది నీరులా చేసుకుంటూ
పోతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, గుజారాత్, హర్యానా బీజేపీ పాలిత
రాష్ర్టాల్లో మాంసం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆయా ప్రభుత్వాలు చట్టాలు
చేశాయి. అయి తే ఈ సారి మహారాష్ట్ర ప్రభుత్వం జైనుల మతపరమై న పర్యూషణ
ఉత్సవాలను సాకుగా తీసుకుని మాం సం అమ్మకాల నిషేధాన్ని తెరమీదికి తెచ్చింది.
అంతే కాదు ముంబాయి శివారు ప్రాంతాల్లో కూడా గోమాంస అమ్మకాలను నిషేధిస్తూ
ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా గోమాంసాన్ని
విక్రయించినా, గోవధకు పాల్పడ్డా ఐదేళ్ల జైలు శిక్ష, లేదా పదివేల రూపాయల
జరిమానా విధిస్తారు. పశువధ, మాంస విక్రయాల నిషేధం మొగలు రాజు అక్బర్
కాలంనుంచీ అమలులో ఉన్నదని సంఘ పరివార్ పెద్దలు చెప్పుకొస్తున్నారు! దానికి
తోడు ఇతిహాసాలు, పురాణాల్లో గోవును పవిత్రమైనదిగా చెప్పిన విషయాలను
చెప్పుకొస్తూ నిషేధాన్ని సమర్థించుకుంటున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 20,21 ప్రతి వ్యక్తికీ తన ఆహార అలవాట్లతో పాటు
అన్ని హక్కులకూ హామీ ఇచ్చింది. ప్రతి వ్యక్తికీ తనదైన ఆహరపుటలవాట్లు కలిగి
ఉండి, నచ్చినది తినే హక్కు ఉన్నది. దీన్ని ఎవరు ఏరూపంలో నియంత్రించినా
వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమేగాక, రాజ్యాంగ ఉల్లంఘనగా చెప్పక తప్పదు. కానీ మన
పాలకులు ఏదో ఒక సాకుతో పశు వధను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే గోవధ చేశారని మహారాష్ట్రలో ముగ్గురిని అరెస్టు చేశారు. సంబంధిత
అవసరమైన పత్రాలన్ని ఉన్నా గోవులను తీసుకు పోతున్న పది లారీలను రాష్ట్ర
సరిహద్దుల్లోనే నిలిపేశారు. అంతే కాదు, మహారాష్ట్ర మంత్రి ఒక అడుగు
ముందుకేసి గోవధపై ఆధారపడే వారంతా.. ఆవుపేడను, ఆవు మూత్రాన్ని అమ్ముకొని
బతకాలని సూచించడంలోని హేళననూ, వారంటే అతనికున్న ఛీత్కారభావాన్ని
పసిగట్టవచ్చు.
ప్రజల్లో ఐక్యతను, జీవన ప్రమాణాలను పెంచేందుకు మాత్రమే పాలనా విధానాలు
ఉండాలి. మెజారిటీ వాదం, ఆధిపత్య విధానాలతో ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు ప్రభుత్వ
విధానాలను ప్రభావితం చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. భిన్న మతాలు,
జాతుల సమ్మేళనంగా తరతరాలుగా భిన్నత్వంలో ఏకత్వంగా సహజీవనం చేస్తున్న
ప్రజల్లో విభజన రేఖలు గీసే చర్యలు ప్రమాదకరమైనవి.
No comments:
Post a Comment