హెల్మెట్ ధరించటం ఖచ్చితంగా అమలవనుండటంతో ద్విచక్ర వాహనదారులలో హడావుడి
మొదలైంది. ఇప్పటికే హెల్మెట్లు కొనుగోలు చేసి పోలీసులు పట్టించుకోని
కారణంగా వాటిని పక్కనపెట్టిన వాహనదారులు వాటిపై పేరుకుపోయిన దుమ్ము
తొలగించి ఆదివారం నుంచి ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఇక ఇప్పటి వరకు హెల్మెట్లు కొనుగోలు చేయని వాహనదారులు హెల్మెట్లు వినియోగం
తప్పనిసరని పోలీసులు ప్రకటించటంతో వాటి కొనుగోలులో తలమునకలయ్యారు. ఆదివారం
నుంచి హెల్మెట్ ధరించటం తప్పనిసరి అని ప్రకటించిన పోలీసు యంత్రాంగం
హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే వందరూపాయల జరిమానా, రెండవసారి
పట్టుబడితే మూడునెలల పాటు వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు లైసెన్స్‌ను
తాత్కాలికంగా రద్దు చేస్తామని ప్రకటించటంతో హెల్మెట్ ధరించటం ఇక తప్పనిసరని
వాహనదారులు అభిప్రాయానికి వచ్చారు. హైకోర్టు కూడా హెల్మెట్ వినియోగంపై
ఖచ్చితమైన ఆదేశాలు జారీచేయటంతో పోలీసు యంత్రాంగం ఆదివారం నుంచి హెల్మెట్
నిబంధనలను కరాఖండిగా అమలు చేయాలనే ప్రయత్నంలో ఉంది. దాంతో ఇప్పటి వరకు
హెల్మెట్లు కొనుగోలు చేయని వాహనదారులు గడచిన రెండురోజుల నుంచి జిల్లా
కేంద్రం
విజయనగరంతోపాటు జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి
తదితర పట్టణాల్లో కొత్త హెల్మెట్ కొనుగోలులో బిజీబిజీగా ఉన్నారు. గడచిన
ఆరునెలలుగా హెల్మెట్ల వాడకం ఇప్పుడు, అప్పుడు అంటూ వాయిదా పడుతుండగా, ఇక
ఈసారి హెల్మెట్ వాడకం తప్పనిసరని తేలిపోవటంతో హెల్మెట్లు విక్రయించే షాపులు
హెల్మెట్ల ధరలను విపరీతంగా పెంచేసి విక్రయిస్తున్నాయి. రెండు, మూడునెలల
కిందట నాలుగు వందల రూపాయలకు విక్రయించిన హెల్మెట్లను ఇప్పుడు ఎనిమిది వందల
రూపాయలకు విక్రయిస్తున్నారు. అప్పట్లో పేరున్న కంపెనీల హెల్మెట్లు ఎనిమిది
వందల నుంచి వేయి రూపాయలకు విక్రయించగా ఇప్పుడు వాహనదారుల అవసరాలను ఆసరాగా
తీసుకుని 12వందల నుంచి రెండువేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఆదివారం నుంచి
హెల్మెట్లు ధరించటం తప్పనిసరి కావటంతో షాపులవారు చెప్పిన ధరలకే హెల్మెట్లు
కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేని హెల్మెట్లు వాడకూడదని పోలీసులు
సూచిస్తున్నా రోడ్డుపక్కన విక్రయించే అనామక హెల్మెట్ల విక్రయం కూడా జోరుగా
జరుగుతోంది. మరోవైపు నాలుగు చక్రాల వాహనం నడిపే వారు విధిగా సీటు బెల్టు
ధరించాలన్న నిబంధన కూడా నేటి నుంచి అమలుకానుంది.
జిల్లాలో చిరుజల్లులు
* అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, అక్టోబర్ 31 ఈశాన్య రుతుపవనాల ప్రభావం గడచిన రెండురోజులుగా
జిల్లాలో కనపడుతోంది. రెండురోజుల కిందటి వరకు ఎండవేడితో జనాలు ఇబ్బందులు
పడుతుండగా, శుక్రవారం నుంచి ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వాతావరణం
చల్లబడింది. జిల్లాలోని ఒకటి, రెండుచోట్ల శుక్రవారం చిరుజల్లులు కురిసాయి.
శనివారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా చల్లటిగాలులు వీయటంతో వాతావరణం
ఆహ్లాదకరంగా మారింది. సాయంత్రం నుంచి విజయనగరం పట్టణంలో ఒకమోస్తరు
కురుస్తోంది. నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ శృంగవరపుకోట, కొత్తవవలస,
వేపాడ ప్రాంతాల్లో సాధారణ వర్షం కురుస్తోంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో
వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తుండటంతో ఖరీఫ్
సీజన్‌లో ముందస్తుగా వరిపంట వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం,
పదిరోజుల్లో పంటకోతకు వస్తున్న తరుణంలో వర్షాలు కురిస్తే పంట దెబ్బతిని
తాము భారీగా నష్టపోవలసి వస్తుందని రైతులు చెబుతున్నారు.
అవసరమైనంత ఇసుక
* ఆర్డర్లకు తగినంత సరఫరా: కలెక్టర్ నాయక్
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, అక్టోబర్ 31: జిల్లాలో వినియోగదారులకు అవసరమైన ఇసుక సరఫరాకు
చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సంబంధిత శాఖల అధికారులను
ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 50ఇసుక రీచ్‌లు ఉన్నా, సెప్టెంబర్ నెలలో
కురిసిన వర్షాలకు కొన్ని రీచ్‌లు మునిగిపోయిన కారణంగా ఇసుక తవ్వకాలు,
సరఫరాలో ఇబ్బందులు కలగడాన్ని ప్రస్తావిస్తూ మునిగిన రీచ్‌ల పునరుద్ధరణకు
చర్యలు తీసుకోవాలని తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ
శాఖల అధికారులతో ఇసుక తవ్వకాలు, రవాణ తదితర అంశాలపై చర్చించారు. ఈ
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు ఇసుక రీచ్‌లు మునిగిన కారణంగా పెండింగ్‌లో
ఉన్న ఇసుక సరఫరా ఆర్డర్లను రెండు, మూడురోజుల్లో క్లియర్ చేసి, ఆ తరువాత
ఆర్డర్ ప్రకారం ఇసుక సరఫరా ఏరోజుకు ఆరోజు జరిగేలా చూడాలని అధికారులను
ఆదేశించారు. డెంకాడ, కోటగండ్రేడు, గోపాలపల్లి, వేములపల్లి, విజనగిరి, జామి,
బిట్రపాడు తదితర ఇసుక రీచ్‌లలో పెండెన్సీ ఎక్కువగా ఉందని చెబుతు, ఈ
రీచులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన
వారి వివరాలను తమకు తెలిపితే, దానికి ఇసుక అందుబాటులో ఉన్న ఇసుక రీచుల
నుంచి వారికి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లావ్యాప్తంగా ఆయా ఇసుక రీచ్‌ల వద్ద 5.51లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక
అందుబాటులో ఉన్నందున నిర్మాణదారులు ఇసుక విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం
లేదని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రమణ, డిఆర్‌డిఎ ప్రాజెక్టు
డైరెక్టర్ ఢిల్లీరావు, జిల్లా పంచాయతీ అధికారి సూర్యనారాయణరాజు తదితరులు
పాల్గొన్నారు
No comments:
Post a Comment